సచిన్ కాళ్లకు నన్ను మొక్కమన్నారు: విరాట్ కోహ్లీ
'కలర్స్' ఛానెల్ లో ప్రసారమయ్యే పాప్యులర్ ప్రోగ్రామ్ కామెడీ నైట్స్ విత్ కపిల్ లో క్రికెటర్ విరాట్ కోహ్లీ సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో ఇండియన్ క్రికెట్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కోహ్లీ వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెటర్ గా తన తొలి రోజులను కోహ్లీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. జట్టులోకి కొత్తగా ఎవరొచ్చినా సచిన్ కాళ్లకు మొక్కాల్సిందేనని సీనియర్ ఆటగాళ్లు తనకు చెప్పారని... తాను అది నిజమేననుకుని సచిన్ వద్దకు వెళ్లి ఆయన కాళ్లు మొక్కేందుకు నిలబడ్డానని... అయితే సచిన్ అదేమీ అవసరం లేదని, సీనియర్ ఆటగాళ్లు నిన్ను ఆటపట్టిస్తున్నారని తెలిపాడని కోహ్లీ వివరించాడు.
ఈ షోలో టాలీవుడ్ శర్మ అనుష్క శర్మతో ప్రేమాయణం గురించి అడిగినప్పడు కోహ్లీ సిగ్గుపడ్డాడు. ఇండియన్ క్రికెట్ టీంతో ఆరేళ్ల ప్రయాణాన్ని కోహ్లీ ఈ షోలో గుర్తు చేసుకున్నాడు. జట్టులో ఇషాంత్ శర్మ మంచి భోజన ప్రియుడని కోహ్లి తెలిపాడు. ఇక రోహిత్ శర్మకు నిద్రపోవడమంటే ప్రాణమని కోహ్లి అన్నాడు. అవకాశం లభిస్తే రోహిత్ శర్మ ఎక్కడైనా, ఎప్పుడైనా కునుకు తీస్తాడని కోహ్లి అన్నాడు. ప్రస్తుత జట్టులో ఛతేశ్వర్ పూజారా అత్యంత బుద్ధిమంతుడని కోహ్లీ తెలిపాడు. అమ్మాయిలంటే పూజారా విపరీతంగా సిగ్గుపడిపోతాడని కోహ్లీ అన్నాడు. పేరుకు తగ్గట్టే పూజారా రోజుకి ఐదుసార్లు పూజ చేస్తాడని కోహ్లీ తెలిపాడు. పూజారా భార్య పేరు కూడా పూజ కావడం విశేషమని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ షోలో అనిల్ కపూర్, ఇషాంత్ శర్మ, రవీందర్ జడేజాలను మిమిక్రీ చేసి కోహ్లీ ప్రేక్షకులను అలరించాడు.